చంద్రబాబు నివాసంలో ముగిసిన ఎన్డీయే నేతల సమావేశం

  • మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఎన్డీయే కూటమి సంపూర్ణ మద్దతు
  • బిల్లుకు మద్దతుగా వైసీపీ సహా అన్ని పార్టీలను ఆహ్వానించాలని నిర్ణయం
  • ఈ నెల 17న అమరావతిలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ప్రత్యేక కార్యక్రమం
  • జిల్లా, నియోజకవర్గ స్థాయిలో కృతజ్ఞతా కార్యక్రమాలు చేపట్టాలని తీర్మానం
మహిళా రిజర్వేషన్ బిల్లుకు సంపూర్ణ మద్దతు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్డీయే భాగస్వామ్య పక్షాలు నిర్ణయించాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసంలో జరిగిన కూటమి నేతల సమావేశంలో ఈ మేరకు కీలక తీర్మానం చేశారు. ఈ బిల్లు విషయంలో రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలను ఏకతాటిపైకి తీసుకురావాలని, వైసీపీని సైతం ఆహ్వానించాలని నిర్ణయించారు. ఈ భేటీలో సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

దాదాపు రెండున్నర గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. లోక్‌సభలో మహిళా బిల్లుపై ఈ నెల 17న చర్చ జరగనుండగా, అదే రోజున అమరావతిలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించాలని తీర్మానించారు. రాష్ట్రంలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ ఈ కార్యక్రమానికి హాజరై, సభా కార్యక్రమాలను ప్రత్యక్షంగా వీక్షించేలా ఏర్పాట్లు చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రజాప్రతినిధులతో పాటు రాష్ట్రంలోని మహిళా ప్రముఖులను కూడా ఆహ్వానించాలని నిర్ణయించారు.

బిల్లు ప్రవేశపెట్టే రోజున రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో లైవ్ స్ట్రీమింగ్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. బిల్లు ఆమోదం పొందిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీకి, మహిళలకు కృతజ్ఞతలు తెలుపుతూ జిల్లా, నియోజకవర్గ స్థాయిలో విస్తృత కార్యక్రమాలు చేపట్టాలని కూడా సమావేశంలో చర్చించారు. 

Chandrababu Naidu
Andhra Pradesh NDA
Mahila Reservation Bill
Women Reservation Bill
Pawan Kalyan
PVN Madhav
Palla Srinivasa Rao
YSRCP
Amaravati
Narendra Modi

More Telugu News